శ్రీదేవితో మిథున్ వివాహం నిజమే కాని

0
‘‘ ఆమెతో 16 సినిమాలు చేశాను. అందులో రెండు విడుదల కాలేదు. మొదటగా ఆమెతో ‘గురుశిష్యులు’ చేశాను. అందులో అక్కినేని నాగేశ్వరరావు, కృష్ణ, సుజాత, శ్రీదేవి హీరోహీరోయిన్లు. తరువాత ఎన్‌టీఆర్‌ సొంత సినిమా ‘అగ్గిరవ్వ’, అనంతరం ‘ముందడుగు’ చేశాను. తరువాత ఎక్కువగా హిందీ సినిమాలు చేశాను. హిందీలో తొలిగా పద్మాలయా వారి ‘మవాలి’ చేశాను.
అలాగే ‘మక్సద్‌’, ‘సోనేపే సుహాగ్‌’ వంటివన్నీ హిట్‌ పిక్చర్సే. ముందడుగు, మక్సద్‌లలో శ్రీదేవి, జయప్రద హీరోయిన్లు. కారణం తెలియదు గానీ వారిద్దరూ ఎడమొహం, పెడమొహంగా ఉండేవారు. మేం కూడా చాలాసార్లు వారిని కలిపేందుకు ప్రయత్నించాం. అయినా కుదరలేదు. ‘మక్సద్‌’ నిర్మాణ సమయంలో రాజేష్‌ఖన్నా, జితేందర్‌ వారిని కలిపారు. కానీ మళ్లీ రెండుమూడు రోజులకే కథ మొదటికి వచ్చింది. . కానీ కెమెరా ముందు ఆ గొడవలేవీ కనిపించేవి కావు.
అప్పట్లో ఆ ఇద్దరూ పోటీపడి నటించేవారు. కానీ శ్రీదేవి ఒక్కశాతం అధికమేమో అనిపించేది. కెమెరా ముందు నిలబడితే ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేసేది. కృష్ణతో తీసిన ‘జయం మనదే’ సినిమాలో కోర్టులో సాక్ష్యం చెప్పాల్సిన సీన్‌లో మాత్రం ఆమె ఎందుకో ఎక్కువ టేక్స్‌ తీసుకొంది. దాంతో ‘మధ్యాహ్నం చేస్తాను సార్‌’ అంది. అన్నట్లుగానే ఆ మధ్యాహ్నం షాట్‌ పూర్తి చేసింది.
‘మక్సద్‌’ పిక్చర్‌లో ఆమె స్నేక్‌ డ్యాన్స్‌ తీస్తుండగా ఆమె మోకాళ్లు కొట్టుకుపోయాయి. దాంతో మోకాళ్లకు నీక్యాప్స్‌ తెప్పించి వేస్తే, అవి వేసుకోవడానికి కూడా ఆమె ఇబ్బంది పడింది. అయినా ఎక్కడా ఆమె డ్యాన్స్‌లో వెనుకడుగు వేయలేదు. బాధను భరిస్తూనే, ఆ ఛాయలేవీ ముఖంమీద కనిపించకుండా ఆ డ్యాన్స్‌ అద్భుతంగా చేసింది. చేసింది.
ఆ తరువాత రెండుమూడేళ్లకు ‘నాగిని’ వంటి సినిమాలు వచ్చాయి. సెట్‌లో ఎంతో హుందాగా, గౌరవంగా ఉండేది. ప్రతి షాట్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకునేది. దర్శక, నిర్మాతలను ఇబ్బంది పెట్టేదికాదు. ‘అగ్గిరవ్వ’ సినిమా చేసేటప్పుడు ఒక సారి కారులో షూటింగ్‌కు వెళ్తున్నాం. ముందుసీట్లో శ్రీదేవి, వెనుకసీట్లో నేను, ఎన్‌టీఆర్‌ కూర్చున్నాం.
తెలుగులో హిట్టయిన ‘కార్తీకదీపం’ సినిమాను ఆ సమయంలోనే హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. ఎన్‌టీఆర్‌ గారు ఆ విషయం ప్రస్తావించి ‘ఏమండీ ఆ పిక్చర్‌ రీమేక్‌ కదా! ఈ అమ్మాయిని పెట్టుకోవచ్చుగా ’ అన్నారు. ‘హిందీ భాషపై పట్టుండాలి, బాగా మాట్లాడగలిగి వుండాలి. అందువల్ల ప్రొడ్యూసర్‌ కాదన్నారండీ అని చెప్పాను. ఆ మాటలు వింటూ శ్రీదేవి కామ్‌గా ఉండిపోయింది.
ఏమీ మాట్లాడలేదు. శ్రీదేవి బాలీవుడ్‌కు వచ్చిన తరువాత 15 సినిమాల వరకూ నాజ్‌ అనే యువతి డబ్బింగ్‌ చెప్పింది. తరువాత ‘వఖ్త్‌కి ఆవాజ్‌’లో ఆమె తొలిసారిగా డబ్బింగ్‌ చెప్పింది. అందులో హీరో మిధున్‌ చక్రవర్తి. అప్పుడు కూడా ఆమెకు కాన్ఫడెన్స్‌ వచ్చేవరకూ వారంరోజులు డబ్బింగ్‌ ఆపాం. దానికి ప్రొడ్యూసర్‌ త్రివిక్రమరావ్‌. ఆ పిక్చర్‌ తరువాత అన్నింటికీ ఆమే డబ్బింగ్‌ చెప్పుకుంది.
 శ్రీదేవితో వివాహం అయిందని మిథున్‌చక్రవర్తి నాతో చెప్పారు. ఆ పెళ్లికి ఆయన తల్లిదండ్రులు కూడా వచ్చారట. బాంబేలోని మడ్‌ ఐల్యాండ్‌లోని బీచ్‌హౌస్‌లో ఆ పెళ్లయింది. బెంగాలీ సంప్రదాయం ప్రకారం తాళి కట్టకుండా, చేతికి కడియం తొడిగి ఒక్కటయ్యారు. అయితే ఈ వ్యవహారాలేవీ ప్రత్యక్షంగా నాకు తెలియదు. ఆమె తల్లిదండ్రుల వల్లనే మిధున్‌తో విడిపోయారనుకుంటాను.విచిత్రమేమంటే అంతకు ముందు వేరే విషయం గురించి మాట్లాడుతూ… ‘రెండో పెళ్లివాడిని మాత్రం చేసుకోవద్దమ్మా’ అని నేను శ్రీదేవితో అని వున్నాను. కానీ అనుకోని పరిస్థితుల్లో అదే జరిగిపోయింది.”
“సీనియర్ దర్శకుడు బాపయ్య”
Post Your Comments
SHARE