శ్రీదేవి నీకోసం నువ్వు మళ్ళి పుట్టమ్మా

0
‘‘ఈ జన్మకు దురదృష్టవంతురాలైన
పరిపూర్ణ మహిళకు భౌతిక వీడ్కోలు
అమ్మా శ్రీదేవీ…
నాలుగేళ్ళ వయసులోనే బాల్యాన్ని కోల్పోయావ్..అమ్మానాన్నల్ని బిడ్డల్లా పోషించావ్..
పదహారేళ్ళ ప్రాయంలోనే కృత్రిమ వెలుగుజిలుగుల మధ్య సున్నితత్వాన్ని కోల్పోయావ్..అక్కచెల్లెళ్ళని, అన్నదమ్ముల్ని ఆదుకున్నావ్..
పాతికేళ్ళ వయసుకే నీదికాని గాంభీర్యాన్ని తెచ్చిపెట్టుకున్నావ్..నీ బ్రతుకులో నిన్ను నువ్వు మర్చిపోయావ్..
దశాబ్దాల తరబడి మాకోసం,మా నయనానందం కోసం, మా హృదయపీఠాన్ని రారాణిలా అధిష్టించడం కోసం, మీ కుటుంబం కోసం, వాళ్ళ బ్రతుకులు బాగుచెయ్యడం కోసం పగలు రాత్రి నటించి.. నటించి.. నటించి.. చివరికి జీవితం అంటే నటనే అనుకున్నావ్..జీవించడం మర్చిపోయావ్..
ఇంకొన్నాళ్ళకి……..
ఇన్నికోల్పోయి నువ్వు సాధించిన “అధ్బుత నటి, అందాలరాశి, దేవకన్య” లాంటి పట్టు శాలువాలన్నీ అలవోకగా విడిచి, చీర కట్టుకుని గృహిణివైపోయావ్..ఇద్దరు బిడ్డల తల్లివైపోయావ్..కెమెరాలకు కొన్నాళ్ళు కనుమరుగైపోయావ్..
పోనీ అక్కడైనా సుఖపడ్డావా? ఆ నిజజీవిత బతుకు పాత్రలో అయినా విశ్రమించావా?…లేదు…
ఆర్ధికంగా భర్తకు ఆసరా అయ్యావ్..పిల్లలకోసం నీ జీవితంలో ముఖ్యమైన నటనను, నీ కోరికలను తృణప్రాయంగా చూశావ్..
ఒడిదుడుకుల జీవితంలో, ఛీత్కారాల మధ్య, అనేక మానసిక సంఘర్షణలతోనే బ్రతుకును ఈడ్చావ్…
తండ్రిని కోల్పోయావ్..వైద్యులు చేసిన తప్పుకు తల్లిని కోల్పోయావ్..చివరకు ఏ కుటుంబం కోసమైతే నీ జీవితాన్ని కోల్పోయావో, వాళ్ళతోనే మాటలు పడ్డావ్..తిట్టించుకున్నావ్..
బాల్యం నుండి ప్రౌఢ వయసుదాకా నటించి వెళ్లిపోయావ్…నీకోసం నువ్వెప్పుడూ బ్రతకలేదనే విషయాన్ని కూడా మర్చిపోయావ్…
కొన్ని కావాలంటే కొన్ని కోల్పోవాలంటారు… కానీ మరీ ఇలా జీవితాన్నే కోల్పోతావా??..
నిన్ను నువ్వే మర్చిపోతావా??…
వచ్చే జన్మలో అయినా నీకోసం పుట్టమ్మా…
..ఇట్లు…
నీ కోట్లాది అభిమానుల్లో ఒకడు….
లక్ష్మీ భూపాల’’
Post Your Comments
SHARE