గాయత్రి సినిమా రీవ్యు.. మోహన్ బాబు నట విశ్వరూపమే

0

సినిమా: గాయత్రి
నటీనటులు: మోహన్ బాబు, మంచు విష్ణు, శ్రియ
దర్శకుడు: మదన్ రామిగాని
రచన: డైమండ్ రత్నబాబు
నిర్మాత: మోహన్ బాబు
సంగీతం: థమన్
విడుదల తేది: ఫిబ్రవరి 9, 2017
రేటింగ్‌: 3.5/5

డైలాగ్ కింగ్‌గా, విలన్‌గా, హీరోగా, క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా నటనలో వైవిధ్యాన్ని చూపిస్తూ విలక్షణ నటుడిగా తెలుగు ప్రేక్షకుల అభిమానం చూరగొన్న నటప్రపూర్ణ, కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు రెండేళ్లుగా సినిమాలకు దూరంగా ఉన్నాడు. అయితే తాజాగా శ్రీ లక్ష్మి ప్రసన్న బ్యానర్‌పై మోహన్ బాబు ‘గాయత్రి’ అనే సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అయితే చాలా కాలం గ్యాప్ తర్వాత వచ్చిన మోహన్‌బాబు సినిమా ఎలా చేశాడు. ఈ సినిమాతో మోహన్‌బాబు హిట్ అందుకున్నాడా? లేదా? తెలుసుకోవాలంటే రీవ్యూలోకి వెళ్లాల్సిందే.

కథ:
రంగస్థల నటుడు దాసరి శివాజీ(మోహన్‌ బాబు) దూరమైన తన కూతురి కోసం వెతుకుతూ అనాథలను చేరదీసి “శారదా సదనం” అనే అనాథాశ్రమాన్ని తన భార్య పేరిట నిర్వహిస్తూ ఉంటాడు. అంతేకాక మంచిపనులు చేసేందుకు డబ్బు కోసం నేరస్థుడిలా మేకప్ వేసుకొని వారికి బదులు జైలు శిక్ష అనుభవిస్తుంటాడు. కాగా కూతుర్ని కలుసుకునే సమయానికి గాయత్రి పటేల్‌ (మోహన్‌ బాబు), శివాజీని కిడ్నాప్ చేస్తాడు. తన బదులుగా శివాజీని ఉరికంభం ఎక్కించేందుకు కుట్ర పన్నుతాడు. తనకు బదులుగా శిక్ష అనుభవించడానికి గాయత్రి పటేల్‌.. శివాజీనే ఎందుకు ఎంచుకున్నాడు..? శివాజీ కూతురు గాయత్రికి, గాయత్రి పటేల్‌కు సంబంధం ఏంటి..? చివరికి గాయత్రి పటేల్‌ లక్ష్యం నెరవేరిందా..? శివాజీ బయటపడ్డాడా లేదా? అనేదే చిత్ర కథాంశం.

నటీనటులు :
సినిమాకి మేజర్ ఎసెట్‌గా చెప్పాలంటే మోహన్ బాబు గురించే చెప్పుకోవాలి. ఆయన ఈ సినిమాలో మళ్లీ మునుపటి నటుడిని తెర మీద చూపించారు. మోహన్ బాబు ఈ సినిమాలో రెండు విభిన్న పాత్రల్లో కనిపించాడు అందులో ఒకటి హీరో పాత్ర అయితే మరొకటి విలన్ క్యారెక్టర్. గాయత్రి పటేల్ క్యారెక్టర్‌లో ఆయన చక్కగా ఒదిగిపోయారు. డైలాగులు చెప్పేటపుడు ఆయన పలికించిన హాహా భావాలు చాలా బాగున్నాయి. విష్ణు, శ్రేయ శరన్ తమ పాత్రలకు తగ్గ న్యాయం చేశారు. మోహన్ బాబు కూతురుగా నటించిన నిఖిలా విమల్ తన పాత్రకు తగ్గ న్యాయం చేసింది. జర్నలిస్ట్‌గా అనసూయ పర్వాలేదు అనిపించింది.

విశ్లేషణ:
కథ పరంగా చూస్తే ఇది పాత కథే. అయితే పాత కథకి ప్రస్తుతం ఉన్న రాజకీయ సంఘటనలని అల్లుకోవడం వల్ల ప్రేక్షకుడు కనెక్ట్ అవుతాడు. ఇకపోతే, మదన్ నుంచి వచ్చిన సినిమాలతో పోలిస్తే ఇది పూర్తి విభిన్న చిత్రం. మోహన్ బాబు అభిమానులకు ఈ సినిమా సూపర్బ్‌గా నచ్చుతుంది. ప్రతి సన్నివేశంలోనూ ఆయన ఒన్ మ్యాన్ షో చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా రోజుల తరువాత మోహన్ బాబుకి సరిపడా డైలాగులు ఈ సినిమాలో పడ్డాయి. ఇకపోతే మంచు విష్ణు కొంత కొంతలో కొంత వరకు మెప్పించాడు. తనకు ఇచ్చిన లిమిటెడ్ పాత్రని చక్కగా చేసుకుంటూ పోయాడు. సినిమాకు మేజర్‌ ప్లస్ పాయింట్‌ డైమండ్‌ రత్నబాబు డైలాగ్స్‌. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో శివాజీ పాత్రతో పలికించిన డైలాగ్స్‌కు మంచి రెస్పాన్స్ వస్తుంది. అయితే దర్శకుడు ఇంకాస్త కష్టపడి ఉండాల్సింది.

టెక్నిషియన్స్ :
మోహన్ బాబు తానే నిర్మాతగా వ్యవహరించి నిర్మించడంతో ఈ సినిమాలో ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. యస్ యస్ థమన్ నేపధ్య సంగీతం బాగున్నప్పటికి పాటలు అంతగా ఆకట్టుకోలేదు. సర్వేశ్ మిరారి అందించిన కెమెరా వర్క్ కూడా బాగుంది. సినిమాలో మేజర్‌గా చెప్పుకోవలసింది డైలాగులు. మోహన్ బాబు లాంటి నటుడికి ఏ మేరకు డైలాగులు రాయాలో అందుకు తగ్గట్టుగా డైమండ్ రత్నబాబు చక్కగా రాశారు. అనుకున్న కథను తెరకెక్కించడంలో దర్శకుడు మంచి నైపుణ్యత చూపించాడు. అయితే మోహన్‌బాబు క్యారెక్టర్ మీదే ఎక్కువగా శ్రద్ద పెట్టినట్లు అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్‌లో కథను సాధారణంగా తెరకెక్కించినా సెకెండాఫ్‌లో ప్రతీ సన్నివేశం అలరించింది.

ప్లస్ పాయింట్లు:
కథ, కథనం
డైలాగులు,
మోహన్‌బాబు నటన,
దర్శకత్వం
బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్

మైనస్ పాయింట్లు:
పాటలు.
స్లో నేరేషన్

ఓవరాల్‌గా మోహన్‌బాబు నటవిశ్వరూపం చూడాలంటే తప్పక చూడాల్సిన సినిమా.

Post Your Comments
REVIEW OVERVIEW
gayatri movie
SHARE